#తెలుగుప్రపంచభాషఎప్పుడవుతుంది?
#తెలుగుప్రపంచభాషఎప్పుడవుతుంది? రచన: వెల్చేరు నారాయణరావు గారు తెలుగు చాలా అందమైన భాష. తెలుగు చాలా తియ్యని భాష. తెలుగు చాలా గొప్ప భాష. (అప్పుడే చప్పట్లు కొట్టకండి.) ఈమాటని ఎవ్వరూ కాదనరు. మా అమ్మాయి చాలా అందమైనది. చాలా తెలివైనది. నాతో ఆ విషయం మీద మీరు ఎప్పుడూ పోట్లాడరు. మీ అమ్మాయి అందమైనది కాదు అని నాతో వాదించరు. పోన్లే పాపం ఆ తండ్రికి కూతురంటే ప్రేమ అని వొదిలేస్తారు. తెలుగు విషయంలో కూడా అంతే. తెలుగువాళ్ళు కానివారి సభకి వెళ్ళి, అందరూ ఇంగ్లీషువాళ్ళో, అందరూ ఫ్రెంచివాళ్ళో, అందరూ జర్మన్లో ఉండగా, తెలుగు ప్రపంచంలోకల్లా అందమైన భాష, గొప్ప భాష అని మీరనండి, తెలుగువాళ్ళు అంతేలే, తెలుగువాళ్లకి వాళ్ళ భాష అంటే అభిమానమని కాసేపు ఊరుకుంటారు. వాళ్ళ సభ్యత అడ్డు వస్తుంది కాబట్టి అంతకన్నా ఇంకేమీ అనరు. మనకి తెలుగు అందమైన భాష కావడానికి కారణం మనకి తెలుగు ఒక్కటే రావడం. మనకి ఇంకొక భాష నిజంగా రాదు. ఉద్యోగరీత్యా వచ్చిన ఇంగ్లీషు భాష మనకి వొచ్చు. సాహిత్యరూపంలో వచ్చే ఇంగ్లీషు మనకి రాదు, కాకపోతే రాదని మనకి తెలియదు. తెలుగువాళ్ళు ప్రపంచంలోకి వచ్చారు. అమెరికా వచ్చారు, ఇంగ్లాండు వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు. ద...